ఉగాది పచ్చడి తిన్న పిచ్చుక

ఉగాది పచ్చడి తిన్న పిచ్చుక
https://commons.wikimedia.org/wiki/File:House_sparrow_(49748195493).jpg

చాలా కాలం క్రితం, సాగర తీరాన ఒక చిన్న కుటీరము ఉండేది. ఆ కుటీరము చుట్టూ అందమైన తోట ఉండేది. ఆ తోటలో గోరింటాకు, గన్నేరు, బంతి, చామంతి, మల్లె, సంపంగి పువ్వులు పూస్తుండేవి. బెండకాయ, బీరకాయ, తోటకూర, గోంగూర, కాయగూరలు పండుతూ ఉండేవి.

ఆ కుటీరము నివాసి నిర్మలమ్మ, చాలా నుంచి మనిషి. తోటలో పువ్వుల,  కాయగూరలు, పండించుకుంటూ ఉండేది. వారానికొక  రోజు దగ్గరలో ఉన్న  గ్రామానికి వెళ్లి, పువ్వులు, కాయగూరలు సంతలో అమ్మి, ఉప్పు, పప్పు, బియ్యం, సరుకులు తెచ్చుకుని సుఖంగా జీవిస్తుండేది.

నిర్మలమ్మకి సాగర తీరంలో ఉండడం చాలా ఇష్టం. ఆవిడ పొద్దున్న, సాయంత్రం సాగరతీరంలో నడవడానికి వెళ్ళేది. సాగర సంగీతం వినడం నిర్మలమ్మకి చాలా ప్రశాంతంగా వుండేది. సముద్రతీరాన నడుస్తూ చేపలు పట్టేవాళ్లతో, చేపలు ఎండ పెట్టవాళ్లతో, ఉప్పు తాయారు చేసేవాళ్లతో మాట్లాడేది. నిర్మలమ్మ దెబ్బ తగిలిన పక్షుల్ని, జంతవుల్ని తన కుటీరానికి తెచ్చి బాగా చూసుకునేది.

ఒక రోజు, నిర్మలమ్మ కుటీరం దగ్గరికి ఒక పిచ్చుక వచ్చింది. ఆ పిచ్చుక కాలికి దెబ్బ తగిలింది. నిర్మలమ్మ పిచ్చుకను జాగర్తగా ఇంట్లోకి తీసుకొచ్చి, కాలుకి మందు వేసి, భోజనం పెట్టి, మంచినీళ్లు ఇచ్చింది. పిచ్చుక మెల్లి మెల్లిగా కోలుకుంది. పిచ్చుకకి నిర్మలమ్మ దగ్గర ఉండడం నచ్చింది.

పిచ్చుక నిర్మలమ్మని ఇలా అడిగింది “అవ్వా! నాకు నీ దగ్గర ఉండిపోవాలని ఉన్నది, నువ్వు సరేనంటే, నేను తోటలో గూడు కట్టుకుని ఉంటాను”. నిర్మలమ్మ సంతోషంగా ఒప్పుకుంది. పిచ్చుక గూడు కట్టుకుని తోటలో ఉండిపోయింది.

పిచ్చుక ప్రతిరోజు పొద్దున్న బయటికి వెళ్లి, సాయంత్రానికి ఇంటికి వచ్చి,  గ్రామ విశేషాలు నిర్మలమ్మకి చెప్పేది. నిర్మలమ్మ సాగరతీరంలో, తోటలో ఏమి జరిగిందో పిచ్చుకకి చెప్పేది.

ఒక రోజు పిచ్చుక చాలా హుషారుగా వచ్చి, “అవ్వా! గ్రామవాసులు చాలా సందడిగా ఉన్నారు. ఇంట్లో బూజులు ఉలిపి, ఇళ్ళు కడిగి శుభ్రం చేస్తున్నారు. గుమ్మాలకి మామిడి తోరణాలు కడుతున్నారు. చాలా సందడిగా, సంతోషంగా ఉన్నారు” అనింది. ఉగాదికి పండగకి తయారవుతున్నారు అని, నిర్మలమ్మ ఉగాది పండుగ గురించి పిచ్చుకకి చెప్పింది.

ఉగాది (యుగాది) నూతన సంవత్సర మొదటి రోజు. ఉగాది రోజున చైతన్య మాసం మొదలవుతుంది . ఆ సంవత్సరాది రోజున అందరూ ముగ్గులు పెట్టి, గుమ్మాలకు మామిడాకు తోరణాలు కడతారు. ఈ సమయంలో వేప చెట్టు పువ్వులు పూస్తుంది. చక్కర గడలు పొలం నుంచి ఇంటికి వస్తాయి. వేడి వేడి తాజా బెల్లం చక్కెర గడ రసంతో తయారవుతుంది. మామిడి చెట్ల మీద పచ్చ మామిడి కాయలు కాస్తున్నాయి . ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి చేస్తారు.  పిచ్చుక ఉగాది గురించి విని,  ఉగాది పచ్చడి చేసి పెట్టమని నిర్మలమ్మని అడిగింది.

పిచ్చుకా! నువ్వు సరుకులు తెచ్చి పెడితే, నేను పచ్చడి చేసి పెడతాను, అన్నది నిర్మలమ్మ. పిచ్చుక ఎగిరి వెళ్లి వేప చెట్టు నుంచి లేత లేత వేప పువ్వులు తెచ్చింది. మామిడి చెట్టు నుంచి పచ్ఛ పచ్చని పచ్చి మామిడి కాయ తెచ్చింది. సముద్ర తీరంలో ఉప్పు తయారు చేసే వాళ్ళ దగ్గరనుంచి ఉప్పు తెచ్చింది. చింత చెట్టు నుంచి చింతపండు తెచ్చింది. గ్రామ దుకాణానికి వెళ్లి మిరియాలు, బెల్లం తెచ్చింది. నిర్మలమ్మ ఉగాది పచ్చడి చేసింది. పిచ్చుక, నిర్మలమ్మ ఉగాది పండగ చేసుకున్నారు.

పిచ్చుక నిర్మలమ్మని అడిగింది:
తియ్యని తియ్యని బెల్లం
చేదు చేదు వేప పువ్వు
ఉప్ప ఉప్ప సముద్ర లవణం
పుల్ల పుల్లని చింతపండు
కారం కారం మిరియాలు
ఇవన్నీ కలిపి చేసిన ఉగాది పచ్చడి
మధుర మధురం - ఎందువలన?

నిర్మలమ్మ ఇలా జవాబు ఇచ్చింది:
సుఖం - దుఃఖం
సంతోషం - కోపం
ఆశ్చర్యం - భయం
మమత - రోత
ఇవన్నీ కలిపితే జీవితం
మధుర మధురం - అందువలన.

ఈ విషయం గుర్తు చేసుకోవడానికి, మనం ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసుకుని తింటాము …

                       April 6th, 2022